విందు: ట్రంప్‌ మెనూలోని వంటకాలివే!

న్యూఢిల్లీ: తొలిసారిగా భారత పర్యటనకు విచ్చేసిన అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌నకు భారత రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఘనమైన విందు ఏర్పాటు చేశారు. రాష్ట్రపతి భవన్‌లో రాత్రి ఏడున్నర గంటలకు ప్రారంభం కానున్న విందులో ట్రంప్‌తో పాటు ఆయన సతీమణి, అమెరికా ప్రథమ మహిళ మెలానియా ట్రంప్‌.. అదే విధంగా ట్రంప్‌ తనయ, సలహాదారు ఇవాంకా ట్రంప్‌ తదితరులు పాల్గొననున్నారు. ఈ క్రమంలో ట్రంప్‌ అభిరుచికి తగ్గట్టుగా ఘుమఘుమలాడే వంటకాలు తయారుచేసినట్లు రాష్ట్రపతి భవన్‌ వర్గాల సమాచారం. కాగా ఆరెంజ్‌తో తయారు చేసిన అమ్యూజ్‌ బౌజ్‌ సర్వ్‌ చేసిన తర్వాత.. సాలమన్‌ ఫిష్‌ టిక్కాతో ఈ గ్రాండ్‌ డిన్నర్‌ ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. వెజిటేరియన్‌ ఫుడ్‌లో భాగంగా... రకారకాల సూపులు ఆలూ టిక్కీ, స్పినాచ్‌ చాట్‌ తదితర వంటకాలను ట్రంప్‌ కుటుంబానికి వడ్డించనున్నారు.


అదే విధంగా రాష్ట్రపతి భవన్‌ ప్రఖ్యాత వంటకం దాల్‌ రైసీనాతో పాటు.. మటన్‌ బిర్యానీ, మటన్‌ ర్యాన్‌, గుచ్చీ మటార్‌(మష్రూమ్‌ డిష్‌) కూడా అమెరికా అధ్యక్షుడి మోనూలో చేర్చారు. డిన్నర్‌ అనంతరం డిజర్ట్‌లో భాగంగా... హాజల్‌నట్‌ ఆపిల్‌తో పాటుగా వెనీలా ఐస్‌క్రీం, మాల్పువా విత్‌ రాబ్డీలను ట్రంప్‌ ఆరగించనున్నారు. దర్బార్‌ హాల్‌లో ట్రంప్‌నకు స్వాగతం పలికిన తర్వాత.. రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఆయనను లోపలికి తీసుకువెళ్తారు. అనంతరం రాష్ట్రపతి భవన్‌లోని నార్త్‌ డ్రాయింగ్‌ రూం వద్ద ఇరువురు కాసేపు భేటీ అవుతారు.


ఈ క్రమంలో తాజ్‌మహల్‌ ప్రతిమతో పాటు కశ్మీర్‌ కార్పెట్‌ను రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌.. ట్రంప్‌నకు బహూకరించనున్నట్లు సమాచారం. ఇక రాష్ట్రపతి భవన్‌లో మంగళవారం జరిగే విందుకు పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఆహ్వానం అందిన సంగతి తెలిసిందే. తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావుతో పాటు మహారాష్ట్ర, హరియాణా, బిహార్‌, ఒడిశా, కర్ణాటక రాష్ట్రాల సీఎంలను రాష్ట్రపతి విందుకు ఆహ్వానించినట్లు సమాచారం. ఇక డిన్నర్‌ అనంతరం ఎయిర్‌ఫోర్స్‌ వన్‌లో ట్రంప్‌ అమెరికాకు తిరిగి వెళ్లనున్నారు.